top of page
Search

తెలుగు భాష ఉండవలసినది ప్రదర్శనశాలలో కాదు. ప్రయోగశాలలో!

ఈ వారం విద్య-బోధనలకు సంబంధించిన వార్త ద్వారా నాకొకటి తెలిసింది. తెలుగువారికి తెలుగుమీద మమకారం లేదు గాని మాతృభాషను పెంపొందించు విలువ భారత ప్రభుత్వానికి అర్థమైందని. లేకపోతె ఏమిటండీ? నేను ఒక అరగంటనుండి "వంటవాడు" లేక "వంటమనిషి" అన్న పదానికి బదులు ఇంకేమేనా పదముందా అని కొట్టుకుపోతూ చివరకి నా పితృభాష అయిన సంస్కృతం నుండి పదాన్ని ఎన్నుకున్నాను. మీకొక ఉపోయోగకరమైన విషయం తమాషాకి చెప్పనా? బహుశా (నిజమనేసుకోవద్దు సుమా!) 70 ఏళ్ల క్రితం, అప్పట్లో మన పాలకులు, "మారుతున్న సమాయంతో పాటుగా ఆధునిక పదజాలాన్నిసృష్టిస్తూ తెలుగు భాషను విస్తరించాలి" అని దృఢసంకల్పంతో "తెలుగు భాషా ప్రయోగశాలను (language lab) ఏర్పాటు చెయ్యండి" అని ఆదేశించి ఉంటారు. అది మన బ్రిటిషువారి హయాంలో శిక్షణపొందిన సగం నిద్రపోతూ ఎలా పనులు ఎగ్గొడదామా? ఎలా జనాల పనులకు అడ్డం పడి వారిని తికమకపెడదామా అనే ఆలోచనలో పడి చివరకి తనే పాపం తికమక పడిపోయి ఆ ఆదేశాన్ని సమ్మంగా వినకుండా ప్రయోగశాల బదులుగా ప్రదర్శనశాల (museum) అని అర్థంచేసుకున్నాడేమో అనిపిస్తుంది. మన సుందర తెలుగు భాషను తీసుకువెళ్లి భద్రంగా గట్టి ఇనప తాళంవేసి, పూర్తి భద్రతతో జాగ్రత్తగా బంధించినట్లున్నాడు. అప్పటినుండి నూతనపదజాలం ఏటిలోకి పోగా ఎరువుతెచ్చుకున్న పదాలు అలవాటైపోయాయి. Fashion అయిపోయాయి. పోనీ ప్రయత్నం చేద్దామా అని పొరపాటున ఒక అచ్చ తెలుగు పదం ప్రయోగించామనుకోండి అవతల సాటి తెలుగోడు నన్ను ఎగాదిగా చూసి "ఏ ఊరు బామ్మరిదీ మందీ" లేదా " brother-in-law! you come which city" అని అంటాడు. ప్రపంచలంలో మనం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ కనీసం ఒక్కభాషనైనా సమంగా మాట్లాడలేకపోతే మనసులో మాటలు ఎలా వ్యక్తపరుస్తాము? కొన్ని పదాలు చూద్దాము (ఉన్నాసరే వాడరు) (ఫ్యాను ఉదాహరణ చూస్తే - గాలి కల్పించు యంత్రము అనుకోవచ్చు. మన భాషలో విసినకర్ర దగ్గర ఆగిపోయాము మనం. మరి ఆ తరువాత సంగతి ఏమిటి?) ఇప్పుడు చెప్పండి. సంస్కృతం మృత భాష అని నూరిపోస్తూ ఉంటారు కదా? మృతి చెందితే సంస్కృతంలో ఇన్ని నూతన పదాలు ఎలా ఆవిష్కరింపబడతాయి. ఎందుకంటే ప్రయోగశాలను తాళంవేసేయలేదు కాబట్టి. అలా అయ్యిందంటే కారణం ఏంటి? స్వాతంత్య్రం తరువాత సంస్కృతానికి పెద్దగా ఆదరణ లేకపోయినా కొద్దిమందే ఉన్నప్పటికీ "నేనింకా బతికే ఉన్నాను కదా. నాకు జీవితం ఉన్నంత కాలం సేవ చేస్తాను" అనే భక్తిభావంతో నిస్స్వార్థంగా సంస్కృత మాతకు చేసిన సేవయే కారణం. వారు చేసిన కృషి ఫలితంగా ఈనాడు ఈ కాలంలో ఎంతో మంది సంస్కృతసంభాషణలో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా భాషకు గౌరవం తెస్తున్నారు. ప్రజలు విస్మరించినా, ప్రభుత్వాలు ఆదరించకపోయినా వాటన్నిటినీ అధిగమించి ఆధునిక కాలంలో నవ ఉత్సాహంతో సంస్కృత భాష ముందుకు దూసుకుపోతోంది. అందువలన సోదరసోదరీమణులారా - తెలుగుభాష కాపాడుకోవడం మనపై ఆధారపడి ఉంది. "ఎవఱోవస్తారని ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నిజాంమరచి నిదురపోకుమా" అని తెలుగు కవి అన్నట్లు మన మాతృభాషను మృతభాష చెయ్యకుండా ఉండాలంటే వెంటనే మన భాషను ప్రదర్శనశాల నుండి విముక్తి కల్గించి ప్రయోగశాలకు తీసుకువచ్చి మరల ప్రాణం పొయ్యాలి. తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా నిరంతరం నీ సేవతో నవ పదాలు సృష్టించరా! రచన: Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి




 
 
 

Comments


Post: Blog2_Post

©2023 by Hindumitra. Proudly created with Wix.com

bottom of page