top of page
Search

మృత్యువు మన వైశ్విక జీవనంలో కేవలం ఒక మలుపు మాత్రమే.



క్రిందటి వారం మా తండ్రిగారు స్వర్గస్తులయిన వేళ నాలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మెదిలాయి. అందులో కొన్ని ఇవి -

1. మనం చావు అను శబ్దం వాడడానికి గాని దాని గురించి మాట్లాడడానికి గాని ఎందుకు జంకుతాము?

2. చావు గురించి మాట్లాడడం వలన మనపై మానసికంగా ఉపసమనం కలిగించు ప్రభావం ఉంటుందా?

3. సంప్రదాయానుసారం మనం మృత్యువు గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటి?


ఒక డాక్టర్ గా మరియు సనాతన ధర్మ అనుచరునిగా నేను మృత్యువు గురించి మాట్లాడం అలాగే అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం నాకు అలవాటైన పని. కానీ నేను గమనించింది ఏమిటంటే మన కుటుంబాలలో చాలా మట్టుకు ఈ విషయంపై ప్రస్తావన తీసుకురావడానికి ఇష్టపడరు. కోపగించుకుంటారు కూడాను. "ఏమిటా అపశకునం మాటలు" అని కూడా విరుచుకుపడచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే ఇటువంటి సున్నితమైన విషయాలను చర్చించుటకు సరైన వాతావరణం మరియు మనోబలం అవసరం. అలాగే ఆధ్యాత్మిక దృక్పధం ఉంటే ఇంకా సులభం.


నిజానికి చాలా సందర్భాలలో ఇవేవి చర్చించకుండా కేవలం ఆ చివరి గడియలు వచ్చినప్పుడు మాత్రమే తట్టుకోలేని దుఃఖంతో కుమిలిపోతారు. అసలు సనాతన ధర్మం ప్రకారం మరణానికి ఉన్న స్థానం ఏమిటి? మరణం గురించి ఆలోచనలో ఆచరణలో ఏ విషయాలు మనలను, అనగా కుటుంబాన్ని, ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి?

1. మరణం అంటే వ్యక్తి శాశ్వతంగా మన జీవితంనుండి తొలగిపోయారని ఒక ఆలోచన. (ఆధ్యాత్మిక దృష్ట్యా అపోహ).

2. మరణం తరువాత శ్రాద్ధకర్మలు ఆచరించాలంటే ఎలా చెయ్యాలో తెలియక తికమక పడడం. సరిగ్గా చేశామా లేకా తప్పు చేశామా అనే ఒక భయం.

3. స్మశానం, శ్రాద్ధకర్మలు చేయుటకు రోజూ వేళ్ళు చోట్లు, మరియు అస్తికలు కలపడానికి వెళ్లే చోటు శుభ్రంగా ఉంటాయా? వీలు సౌకర్యం ఉంటుందా? ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారు మరియు వృద్దులు, స్త్రీలు, పిల్లలు ఆ చోట్లకి వెళ్లగలిగే సదుపాయం శుభ్రతా ఉంటాయా?

4. సనాతన ధర్మంలో మరణానికి ఇవ్వబడ్డ ఉన్నతస్థాయిని మనం మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఆచరణలో గౌరవిస్తున్నామా. లేక నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తున్నామా?

5. ఎంతమంది మరణంపై అవసరమైన జ్ఞానం లేక ఛాదస్తం మరియు మూర్కత్వం అని చెప్పి విసుగ్గా శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్నారు. వీరికి నేర్పించేవారు ఎవరు?

6. శ్రాద్ధకర్మలు చేయించు బ్రాహ్మణులకు సమాజంలో ఉన్న స్థానం ఏమిటి? వారిని సమాజం గౌరవిస్తోందా?

ఉదాహరణకి, మరణం తరువాత 10వ రోజు వరకు గరుడ పురాణం చదవాలి అని చెప్పిన్నప్పటికీ గరుడపురాణం ఇంట్లో ఉంటె అశుభం అని తెలుగువారు పెట్టుకోరు అని ఒక మహాపండితుడు విలపించి అటువంటి భయాలు తొలగించుకోమని చాటి చెప్పారు.


ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మనమే మన సమాజాన్ని ఉద్దరించుకోవాలి. గరుడ పురాణంలో చెప్పినట్లు "ఆత్మ పునర్జన్మను పొందుతున్నప్పుడు ఉన్నతలోకాలను వీడి ఇష్టంలేకపోయినా జన్మ స్వీకరిస్తుంది. అలాగే గర్భంలో ఉన్నప్పుడు ఈ జన్మలో నేను సత్కర్మలు అనుసరిస్తాను అని నిశ్చయించి పుడుతుంది. అయినప్పటికీ పుట్టుక తరువాత మాయ ప్రభావముచే అది మర్చిపోయి మరల ఇంద్రియ-ఇంద్రియవిషయాలకు లొంగిపోయి అవే పొరపాట్లు చేస్తూ ఉంటుంది. మరణం పొందిన తరువాత ఆధ్యాత్మిక ప్రగతిని అనుసరించి మోక్షం పొందవచ్చు లేదా పితృ లోకానికి చేరవచ్చు. ఆ పితృలోకాన్ని చేరే ప్రయాణంలో మనం అనగా కుటుంబం ఆ ఆత్మకు సహాయం చేస్తున్నాము. అలాగే పితృ ఋణం కూడా తీర్చుకుంటున్నాము." ఒక చోట గరుడ పురాణంలో ఇలా చెప్పబడింది "దేవతార్చన కన్నా పితురులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేప్పట్టడం అత్యావశ్యకం" అని. నిజానికి ప్రపంచంలో ఏ మూల చూసినా పూర్వం వారి వారి సంప్రదాయానుసారం అందరు పితురులకు గౌరవాన్ని అర్పించి వారినుండి ఆశీర్వాదము పొందుతూ వచ్చారు.



అందువలన మనం అందరు చేయవలసినవి

1. మృత్యువు పై సరై అవగాహన పొందడం. అది అశుభం కాదు. ఆధ్యాత్మిక దృష్ట్యా శుభమే. ఎందుకంటే ఆత్మ పితృలోకాన్ని చేరడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. లేదంటే మోక్షం సంపాదిస్తుంది.

2. శ్రాద్ధకర్మలు చేసే చోట్లను ఉద్యానవనంలా తీర్చిదిద్దాలి. అక్కడికి అందరూ మనసులో ఎటువంటి సందేహాలు లేకుండా కేవలం మరణంపొందివారి పై మరియు దైవం పై ధ్యాస పెట్టి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలగాలి.

3. యువతరానికి తెలియపరచాలి. మన సంప్రదాయంలో మరణించిన ప్రతి వ్యక్తికీ గౌరవప్రదమైన వీడ్కోలు కల్పించవచ్చు. మన ప్రయత్నంతో పాపపుణ్యాలలో తారతమ్యాలు లేకుండా మన ప్రయత్నంతో వారికి సద్గతి కల్పించు ప్రయత్నం మన వంతు మనం చెయ్యవచ్చు అని మనం తెలుసుకుని సమాజానికి తెలియపరచాలి.


Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి



 
 
 

Comments


Post: Blog2_Post

©2023 by Hindumitra. Proudly created with Wix.com

bottom of page