ఆత్మయే దైవము - స్వభావమే ధర్మము.
- Srinivasa Malladi
- Mar 11
- 2 min read

సనాతనధర్మ అవగాహన , ఆచరణ మరియు ప్రకటన మాత్రమే హిందూమిత్ర ధ్యేయం.
హిందూమిత్ర సిద్ధాంతం ప్రకారం ఆత్మవిద్య మాత్రమే పునాదిగా భావించబడుతుంది. ఆ పైన ఎవరు ఏ దేవతను ఆరాధిస్తారో తిరస్కరిస్తారో, ఏ గురువును అనుసరిస్తారో తిరస్కరిస్తారో, ఏ వ్యక్తిని గౌరవిస్తారో తిరస్కరిస్తారో హిందూమిత్ర విధానానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చెయ్యట్లేదు అని హిందూమిత్ర మీ జోలికి రాదు. అలా అని ఇంకొకరి మనోభావాలను దెబ్బ తీసే అధికారం ఎవరికీ లేదు.
సనాతన ధర్మ మూల సిద్ధాంతము అయిన ఆత్మవిద్య అనగా, పరమాత్మ, జీవాత్మ, కర్మ, పునర్జన్మ, ధర్మ, యోగ, మోక్షములను మూలాలుగా విశ్వసించి, అనుసరిస్తే హిందూమిత్ర అనబడుతారు. అవిచేయని యడల హిందూమిత్ర అనబడరు.
అందుచేత పురాణ, ఇతిహాసాల జ్ఞానం తప్పనిసరి కాదు. ఆ మాటకొస్తే వేదాలు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో మంది అక్షరజ్ఞానంలేని వారు కూడా సనాతన ధర్మ సారాన్ని చక్కగా ఆచరించారు ఆచరిస్తున్నారు కూడా. పురాణ ఇతిహాసాలు మనకు ధర్మం మరియు అధర్మం గూర్చి ఉదాహరణలు తెలుపునవిగా అలాగే ఆత్మవిద్యను గుర్తుచేయు ఉదాహరణలు మాత్రమే కానీ అవి సనాతన ధర్మానికి మూలాలు కావు.
సనాతన ధర్మము ఆద్యాన్తరహితము. వేదాలు కూడా శబ్దమను ఆకారమే. నిరాకారమైన మనం అంతకు ముందునుండే ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఉన్నాము. ఉంటాము కూడా. మనమే ఆ నిత్యసత్యం. అది గుర్తుచేయడానికి మరియు సులభంగా అర్థంచేసుకోవడానికి మాత్రమే గ్రంథాలు. ఈ అనంత ప్రవాహంలో అనేక శ్రేష్టమైన మనుష్యులు దేవతలు ఋషులు గ్రంథాలు ఉద్భవించాయి. వీరి ద్వారా వాటి ద్వారా మనం అదే నిత్యసత్యాన్ని పదే పదే తెలుసుకుంటాం. ఈ శ్రేష్టమైనవి మనకు మోక్షమార్గాన్ని గుర్తుచేయడానికి, అలాగే ఇహలోకం ద్వంద్వాలను ధర్మము ద్వారా అధిగమించడానికే గానీ ఇవియే మూలనిత్యసత్యమని భ్రమించరాదు.
పురాణ ఇతిహాసాలలో పాత్రల ఖండన, విశ్లేషణ, పొగడ్త మీ మీ వ్యక్తిగతం. ఆ స్వేచ్ఛ మీకు సనాతన ధర్మం ఇస్తుంది. అయితే వైజ్ఞానిక దృక్పధంతో మసలుకోవాలి కాబట్టి దేవత, గురువు, పద్దతి, వ్యక్తి ఖండనగాని శ్లాఘనగాని సాక్షాధారాలతో మాత్రమే చేయడం కనీస బాధ్యత. సాక్షాధారాలు ప్రవేశ పెట్టనియడల దేవదానవ, గురు, వ్యక్తి, పద్దతి, దేశ, మత ఖండన, శ్లాఘన చేయడానికి హిందూమిత్ర విధానం అనుమతించదు.
ఒకసారి మానవునిగా పుడితే వారు సాక్షాత్ పరబ్రహ్మమైనా కూడా ధర్మసంకటాలలో చిక్కుకుని బాహ్యప్రపంచదృష్ట్యా "అతడు చేసినది ముమ్మాటికీ ధర్మమే - కాదు కాదు ముమ్మాటికీ అధర్మమే" అనే అభిప్రాయబేధం కలిగించే విధంగా సంసారమనే జగన్నాటకంలో వ్యవహరించక తప్పదు. అది భీష్ముడైన, రాముడైన, మోహన్దాస్ కరంచంద్ గాంధీ అయినా ఎవరైనా కూడా. ఇందులో వీరందరినీ కలిపే ఒకే ఒక్క గొప్ప గుణం ఏమిటంటే ధర్మసంకటాలు వచ్చినప్పుడు "వారి స్వభావమును వదిలిపెట్టారా? లేక దానిప్రకారమే ఆచరించారా?" అనేది. వారు వారి సత్యాన్ని గ్రహించి కష్టమొచ్చినా నష్టమొచ్చినా "నేను నా స్వభావాన్ని విడిచిపెట్టను" అని నిశ్చయబుద్ధితో ఇదియే ఈ జన్మకు నా పాత్ర అని వ్యవహరించినవారు. అందుచేత నిజమైన వీరులు.
ఆ మాటకు వస్తే సృష్టిలో అందరికి ఒక పాత్ర ఉంటుంది. అది సురులైనా, అసురలైనా వారు వారి స్వభావానుసారం ఆ పాత్రను మనకు తెలియని పరమాత్మ రచనలో భాగంగా పోషిస్తారు. మానవులం మనం అది తెలుసుకోవాలి. స్వభావానుగుణం నిజాయితీగా మన పాత్రను పోషించాలి.
సనాతన ధర్మం బీజమైతే హైందవం ఆ బీజము నుండి వచ్చిన అనేక కొమ్మలుగా వ్యక్తమవ్వు అనేక మతముల సమ్మేళనం. ఆ విశ్వసత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రతివ్యక్తి మనస్సుకు అందగలిగిన బాహ్యప్రపంచ సత్యము మాత్రమే ఈ విభిన్న మతములు. అందుచేత మనుష్యుల ద్వారా ఎన్ని మనస్సులు సృష్టింపబడ్డాయో అన్ని మతాలు ఉంటాయి. అనగా అన్ని అభిప్రాయాలు.
వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎంత వరమో కులం పేరున, సంప్రదాయం పేరున, ఇష్టదేవత పేరున, గురువుపెరున ఇలా అనేక విభజనలు హైందవానికి శాపం. ధర్మమును ఆచరించువారిని కలుపుకుని వెళ్లే వారు మాత్రమే హిందూమిత్రులు. బాబాలను, ... కుమారిలను ఇలా ఎంతమందిని తిట్టి ఎంతమందిని హిందువులము దూరంచేసుకుంటాము? చేతనైతే అందరినీ మన ఆత్మవిద్య ఆచరణతో కలుపుకుందాం.
ఒకవైపు వసుధైవ కుటుంబకం అని చెప్పి మరో వైపు చీలికలకు దారితీసే ప్రయత్నాలు ముమ్మాటికీ ఆధ్యాత్మిక ఆచరణ లోపం. క్షాత్రధర్మాన్ని కేవలం అధర్మాన్ని ఖండించడానికి మాత్రమే ఆచరించాలి. కానీ ఆ క్షత్రీయుడే ధర్మాన్ని అనుసరించు అందరినీ లాలించి పాలించాలి కూడాను.
కేవలం ధర్మ స్థాపనయే ధ్యేయంగా భావించి చర్చలు కొనసాగాలి. వాద, జల్ప, వితండ అను మూడు పద్దతులలో వాదము మాత్రమే శ్రేష్టమైనది. అందులో చర్చించు ఇరువర్గాలు కేవలం సత్యమే గెలవాలని చర్చిస్తారు. ఇలా మనం నేర్చుకున్న పాఠాలను ముందరకు తీసుకువెళ్లి చక్కగా చర్చించు విధానాన్ని అలవాటుచేసుకుందాం.
హిందూమిత్ర సత్సంగాలు ప్రతినెలా కొనసాగుతాయి. వచ్చే నెల వ్యాస మహాభారతం ఆధారంగా భీష్మపితామహుని జీవితం నుండి ధర్మసంకటాలను ఎలా అధిగమించాలో చర్చ ద్వారా తెలుసుకుందాం. ఆశక్తి ఉన్నవారు దయచేసి తయారై రండి.
సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు
భవదీయడు
Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి
హిందూమిత్ర వ్యవస్థాపకులు మరియు కార్యదర్శి
Comments